: ప్రశాంత్ కిశోర్ కు కేబినెట్ హోదా ఇవ్వడమనేది సీఎం ఇష్టం: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి


ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కు బీహార్ లో కేబినెట్ హోదా కల్పించడంపై తాము జోక్యం చేసుకోమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జేఎస్ ఖేహార్ స్పష్టం చేశారు. ప్రశాంత్ కిశోర్ కు కేబినెట్ హోదా కల్పించడాన్ని సవాల్ చేస్తూ ఓ న్యాయవాది గతంలో సుప్రీంకోర్టును ఆశ్రయించారు.ఈ  కేసు ఈ రోజు విచారణకు వచ్చింది. ప్రశాంత్ కిశోర్ పై ముఖ్యమంత్రికి నమ్మకం ఉందని, ఆయనతో కలిసి పని చేయాలని అనుకుంటున్నారని, ఈ విషయంలో న్యాయస్థానం జోక్యం చేసుకోదని ఖేహార్ స్పష్టం చేశారు.

కాగా, ప్రభుత్వ పథకాలకు సంబంధించి కీలక సలహాలు ఇచ్చేందుకు ప్రభుత్వ అధికారుల బృందం ఒకటి ఇప్పటికే అందుబాటులో ఉందని, ఆ బృందం నుంచి ఒకరిని సీఎం ఎంపిక చేసుకోవాలని సదరు న్యాయవాది తన ఫిర్యాదులో కోరారు. ఆ పదవిలో ప్రశాంత కిశోర్ ను నియమించడంలో అర్థం లేదని, వెంటనే తొలగించాలని ఆ న్యాయవాది అభ్యర్థించడం జరిగింది.

ఇదిలా ఉండగా,ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ పేరు ఎంత పాప్యులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 2015లో జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ-ఆర్జేడీ-కాంగ్రెస్ మహా కూటమికి వ్యూహకర్తగా ప్రశాంత్ కిశోర్ వ్యవహరించారు. ఆ ఎన్నికల్లో ఈ మహాకూటమి విజయం సాధించడం తెలిసిందే. ఈ ఎన్నికల్లో ప్రశాంత్ కిశోర్ వ్యూహ ప్రతివ్యూహాలు ఫలించడంతో బీహార్ సీఎంగా వరుసగా మూడోసారి నితీశ్ కుమార్ ఎన్నికయ్యారు. దీంతో, ప్రశాంత్ కిశోర్ కు కేబినెట్ హోదా కల్పిస్తూ ప్రభుత్వ పథకాలకు సంబంధించి కీలక సలహాలు ఇచ్చే హోదాలో ఆయన్ని నితీశ్ నియమించడం జరిగింది. 

  • Loading...

More Telugu News