: ఆ జైల్లో అసువులు బాసిన రెండో భారతీయుడు సరబ్
కోట్ లఖ్ పత్ కేంద్ర కారాగారం.. పాకిస్తాన్ లోని లాహోర్ నగరంలో ఉన్న ఈ జైలు పేరు వింటే ఇప్పుడు భారతీయుల్లో ఆగ్రహం పెల్లుబుకుతుంది. భారతీయ ఖైదీ సరబ్ జిత్ సింగ్ విషాదకర పరిస్థితుల్లో ప్రాణాలు విడిచిన నేపథ్యంలో ఈ జైలు వార్తల్లో నిలిచింది. గూఢచర్యంతో పాటు బాంబు పేలుళ్ళ కేసులో సరబ్ జిత్ ఇదే జైలులో ఖైదీగా ఉన్నారు. కొద్దిరోజుల క్రితం ఇద్దరు ఖైదీలు కిరాతకంగా దాడి చేయడంతో మృత్యువుతో పోరాడి నిన్న అర్థరాత్రి తుదిశ్వాస విడిచాడు సరబ్ జిత్.
అయితే, ఈ మృత్యు కారాగారంలో ప్రాణాలు కోల్పోయిన భారతీయుడు సరబ్ జిత్ ఒక్కడే కాదు, చమేలి సింగ్ అనే మరో వ్యక్తి కూడా ఇక్కడ సరబ్ జిత్ తరహాలోనే అసువులు బాశాడు. చమేలి సింగ్ కూడా గూఢచర్య అభియోగంపై లఖ్ పత్ జైల్లో ఖైదీగా ఉన్నాడు. గత జనవరిలో చమేలి సింగ్ అనుమానాస్పద స్థితిలో మరణించాడు. పోస్ట్ మార్టంలో అతను చిత్రహింసకు గురైనట్టు స్పష్టమైంది.