: బాబు అక్రమాలపై బీజేపీపై ఒత్తిడి తెండి: సమాజ్ వాదీ అధినేతతో వైఎస్ జగన్


ఆంధ్రప్రదేశ్‌ లో ప్రజాస్వామ్యం నిట్టనిలువునా కూలిపోయిందని వైకాపా అధినేత వైఎస్ జగన్, సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ కు వివరించారు. ఈ ఉదయం ఆయన్ను కలిసిన జగన్, రాష్ట్రంలో జరిగిన ఫిరాయింపుల వ్యవహారాన్ని, వైకాపా టికెట్ పై గెలిచి, టీడీపీ ప్రభుత్వంలో మంత్రి పదవులు పొందిన వైనాన్ని ములాయం దృష్టికి తీసుకెళ్లారు. సుమారు 30 నిమిషాలకు పైగా సాగిన ఈ సమావేశంలో, రాష్ట్రంలో జరుగుతున్న విషయాలన్నింటినీ వివరించిన ఆయన, ఇదే పరిస్థితి కొనసాగితే, దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం అన్నారు.

ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు తాము చేస్తున్న పోరాటానికి సహకరించాలని, ఫిరాయింపుల నిరోధక చట్టానికి పదును పెట్టేందుకు కేంద్రంపై ఒత్తిడి తేవాలని కోరారు. బాబు చేస్తున్న అక్రమాలను అడ్డుకునేందుకు బీజేపీపై ఒత్తిడి తేవాలని, వెంటనే కొత్త చట్టం చేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. రాష్ట్రంలో చంద్రబాబుతో జతకట్టిన బీజేపీ సైతం, ఈ ఫిరాయింపులను చూస్తూ మిన్నకుందని ఫిర్యాదు చేశారు. జగన్ చేస్తున్న వాదనలపై ములాయం కూడా సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. కాగా, జగన్‌ తో పాటు పార్టీ ఎంపీలు అవినాష్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, మిథున్ రెడ్డి, మేకపాటి రాజమోహనరెడ్డి తదితరులు ములాయంను కలిసిన వారిలో ఉన్నారు.

  • Loading...

More Telugu News