: తన కన్నా 20 ఏళ్ల చిన్నవాడిని పెళ్లాడిన పుతిన్ మాజీ భార్య
రష్యా అధ్యక్షుడు పుతిన్ మాజీ భార్య లుడ్మిలా పుతిన్ 58 ఏళ్ల వయసులో మరోసారి పెళ్లికూతురు అయ్యారు. తనకన్నా 20 ఏళ్లు చిన్నవాడైన వ్యాపారవేత్త ఆర్థర్ ఓషెరెట్నీని వివాహం చేసుకున్నారు. పుతిన్, లుడ్మిలాలు దాదాపు 30 సంవత్సరాల పాటు కలిసే ఉన్నారు. రష్యా గూఢాచార సంస్థ కేజీబీలో పుతిన్ పని చేస్తున్నప్పుడు లుడ్మిలాను పెళ్లాడారు. 1983లో వీరి వివాహం జరిగింది. అప్పుడు వారిద్దరూ ఆనాటి తూర్పు జర్మనీలో ఉన్నారు.
అనంతరం రష్యా వచ్చిన పుతిన్... రాజకీయాల్లోకి వచ్చారు. ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన నేతల్లో ఒకరిగా ఎదిగారు. లుడ్మిలా మాత్రం ఇంటికే పరిమితం అయ్యారు. 2013లో వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. విడాకులు తీసుకున్న తర్వాత లుడ్మిలా ఎక్కడున్నారన్న విషయం రష్యన్లకు కూడా తెలియదు. ఆమె వివరాలు ఎక్కడా కనిపించలేదు. పుతిన్ జీవిత చరిత్ర నుంచి కూడా లుడ్మిలా వివరాలను తొలగించారు. ఈ నేపథ్యంలో, ఆమె మరో పెళ్లి చేసుకున్న విషయం వెలుగుచూసింది. తన రెండో భర్త ఆర్థర్ తో కలసి ఫ్రాన్స్ లోని ఓ విల్లాలో ఆమె నివసిస్తున్నట్టు తెలిసింది.