: చెన్నై సెంట్రల్ జైలులో సెల్‌ఫోన్లు, గంజాయి విక్రయానికి యత్నం.. ఇద్దరి అరెస్ట్
చెన్నైలోని పుళల్ సెంట్రల్ జైలులో ఖైదీలకు సెల్‌ఫోన్లు, గంజాయి విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. సెంట్రల్ జైలు పోలీసు క్వార్టర్స్ ప్రాంతంలో గస్తీలో ఉన్న పోలీసులకు మోటారు సైకిలుపై వెళ్తున్న ఇద్దరు అనుమానాస్పద వ్యక్తులు కనిపించారు. పోలీసులను చూసిన వారు వాహనాన్ని వదిలి పరారయ్యేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని వెంబడించి పట్టుకున్నారు. నిందితులను పళవందాంగళ్‌కు చెందిన దినేశ్, మాంగాడుకు చెందిన వెంకటేశ్‌గా గుర్తించిన పోలీసులు వారి నుంచి రెండు సెల్‌ఫోన్లు, మూడు చార్జర్లు, రెండు కొత్త సిమ్‌కార్డులు, గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. సెంట్రల్ జైలులోని ఖైదీలకు విక్రయించేందుకు వాటిని తెచ్చినట్టు నిందితులు అంగీకరించారు.