: మా జాతీయ గీతం తొలగించాలా? అయితే మా సినిమాను పాకిస్థాన్ లో ప్రదర్శించాల్సిన అవసరం లేదు: అమీర్ ఖాన్
'నా భార్య ఒక దశలో మనదేశంలో రక్షణ ఉంటుందా? అని నన్ను అడిగింది' అంటూ గతంలో అమీర్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు ఎంత దుమారం రేపాయో అందరికీ తెలిసిందే. ఆ క్షణంలో అమీర్ ఖాన్ ను తిట్టని జాతీయవాది లేడంటే అతిశయోక్తి కాదు. అయితే అమీర్ ఖాన్ దేశభక్తిని ప్రస్తావించే సంఘటన ఈ మధ్య ఒకటి చోటుచేసుకుంది. పాక్ నటులపై బ్యాన్ విధించడంతో పాక్ లో భారతీయ సినిమాలపై బ్యాన్ విధించారు. అయితే పాక్ డిస్ట్రిబ్యూటర్లు, ధియేటర్ యజమానులకు భారతీయ సినిమాలే ఆధారం కనుక మళ్లీ బ్యాన్ ఎత్తేశారు. ఈ నేపథ్యంలో అమీర్ ఖాన్ నిర్మాతగా వ్యవహరించి, నటించిన 'దంగల్' సినిమాను పాకిస్థాన్ లో ప్రదర్శిస్తామంటూ ఒక డిస్ట్రిబ్యూటర్ ముందుకు వచ్చాడు. దీనికి అమీర్ ఖాన్ కూడా అంగీకరించాడు. దీంతో ఆ డిస్ట్రిబ్యూటర్ 'దంగల్' సినిమాను పాకిస్థాన్ సెన్సార్ బోర్డు వద్దకు పంపాడు. దీంతో సెన్సార్ బోర్డు అతనికి రెండు సూచనలు చేసి తిప్పిపంపింది.
దీంతో ఆ డిస్ట్రిబ్యూటర్.. అమీర్ ఖాన్ కు పాక్ సెన్సార్ బోర్డు చేసిన ప్రతిపాదనను వివరించాడు. ఈ సినిమా చివర్లో గీతా ఫోగట్ విజయం సాధించిన సందర్భంగా కనిపించే భారత జాతీయ జెండాను, అలాగే ఆ సమయంలో వచ్చే భారత జాతీయ గీతాన్ని ఎడిట్ చేయాలని అన్నాడు. దీంతో చిర్రెత్తిన అమీర్ ఖాన్... తమ సినిమాలో పాకిస్థాన్ కు వ్యతిరేకంగా ఎలాంటి సన్నివేశమూ లేదని, ఆ సినిమా మహిళా సాధికారతను చాటేదని, ఆ సన్నివేశాలు ఎడిట్ చేసే ప్రశ్నేలేదని స్పష్టం చేశాడు. దీంతో ఆ వ్యక్తి అమీర్ ఖాన్ కు సర్దిచెప్పే ప్రయత్నం చేయగా...తనకు డబ్బు రాకపోయినా, తన సినిమాను పైరసీ చేసుకున్నాఅభ్యంతరం లేదు కానీ... తన సినిమాలో జాతీయతా భావాన్ని పెంపొందించే ఆ సీన్లను ఎడిట్ చేసేది మాత్రం లేదని తేల్చిచెప్పాడని బాలీవుడ్ లో ఒక చర్చ నడుస్తోంది. దీంతో ఆ డిస్ట్రిబ్యూటర్ షాక్ తిన్నాడట.