: ఓ మెట్టు దిగిన శివసేన ఎంపీ గైక్వాడ్.. పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ మంత్రికి లేఖ!
ఎయిర్ ఇండియా అధికారిపై దాడికి పాల్పడిన విషయమై శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్ పశ్చాత్తాప పడ్డారు. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజుకు ఆయన ఓ లేఖ రాశారు. కాగా, ఎంపీ రవీంద్ర గైక్వాడ్ విమానయానం బ్లాక్ చేయడంపై పార్లమెంట్ లో ఈ రోజు చర్చ జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అశోక్ గజపతి రాజుతో శివసేన ఎంపీలు దురుసుగా ప్రవర్తించారు. శివసేన ఎంపీల ప్రవర్తనపై పలు పార్టీలు ఇప్పటికే అభ్యంతరం వ్యక్తం చేశాయి. అయితే, గైక్వాడ్ పశ్చాత్తాప పడుతూ లేఖ రాసిన నేపథ్యంలో ఈ వ్యవహారానికి ఇంతటితో స్వస్తి పలకాలనే ఉద్దేశంలో కేంద్రం ఉన్నట్టు తెలుస్తోంది. ఎయిర్ లైన్స్ ఆయనపై విధించిన నిషేధం ఎత్తివేయవచ్చని సమాచారం.