: భర్త కాళ్ల వద్దే కన్నుమూసిన భార్య.. ఆపై గంటలోనే భర్త మృతి!
హైదరాబాద్ శివారులోని కుత్బుల్లాపూర్లో విషాదం చోటు చేసుకుంది. ఎన్నో దశాబ్దాలుగా ఒకరంటే ఒకరు ప్రాణంగా బతికిన ఆ దంపతులు చివరి నిమిషాల్లో కూడా ఒకరిని విడిచి మరొకరు ఉండలేకపోయారు. మంచాన పడ్డ భర్తకు సేవలు చేస్తూ ఆయన కాళ్లవద్దనే కన్ను మూసింది ఆ ఇల్లాలు. అయితే, తన భార్య ఇక తనతో ఉండబోదన్న విషయం తెలుసుకున్న ఆ భర్త కూడా గంట వ్యవధిలో మంచం మీదనే మృతి చెందాడు.
కుత్బుల్లాపూర్లో నివసించే చిట్యాల పోచయ్య (93), ఎల్లమ్మ (82)లు ఇలా వెంట వెంటనే మరణించారని తెలుసుకున్న ఆ గ్రామస్థులు కంటతడి పెడుతున్నారు. ఆ దంపతులకి ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారందరికీ వివాహం జరిగింది. రెండు నెలల క్రితం భర్త పోచయ్య కాలు విరిగింది. అప్పటి నుంచి ఆయన మంచానికే పరిమితమయ్యాడు. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు భార్య ఎల్లమ్మ అతని కాళ్ల వద్దే చనిపోగా, 5 గంటల సమయంలో భర్త పోచయ్య కూడా మృతి చెందాడు.