: 22 ఏళ్ల నుంచి అదే మాట వింటున్నాను: షారూఖ్ ఖాన్
22 ఏళ్ల నుంచి తన కెరీర్ ముగిసిపోయిందనే మాట వింటున్నానని బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ తెలిపాడు. షారూఖ్ సినిమాలు ఊహించిన వసూళ్లు సాధించలేకపోతుండడం పట్ల బాలీవుడ్ లో చర్చ మొదలైంది. అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్ వీరు ముగ్గురూ నటించిన సినిమాలు వరుసగా హిట్టవుతూ వంద కోట్ల క్లబ్ లో స్థానం సంపాదించుకుంటూ నిర్మాతలకు కాసుల పంట పండిస్తున్నాయి. ఈ మధ్య కాలంలో షారూఖ్ నటించిన ప్రతి సినిమాను ఏదో ఒక నిర్మాణ సంస్థ, అతని సొంత నిర్మాణ సంస్థ రెడ్ చీల్లీస్ ఎంటర్ టైన్ మెంట్ తో కలిసి నిర్మిస్తోంది. ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాలు హిట్ టాక్ సంపాదించుకున్నప్పటికీ గతంలోలా బాక్సాఫీసు వద్ద మ్యాజిక్ చేయడంలో విఫలమవుతున్నాయి.
ఈ నేపథ్యంలో షారూఖ్ వివరణ ఇస్తూ, గత 22 ఏళ్లుగా చాలా మంది అదే మాట చెబుతున్నారని అన్నాడు. ఎప్పుడో ఒక సినిమా సరిగ్గా ఆడకపోవచ్చు...కానీ చాలా సినిమాలు విజయవంతంగా ఆడాయి కదా? అని అంటున్నాడు. ఇలా అంటున్నవారు నటుడికి ఉండే లక్ష్యాలు, ఉద్దేశాలను అర్థం చేసుకోవడంలో విఫలమవుతున్నారని అన్నాడు. తానే కాదు, ఏ నటుడైనా ప్రేక్షకుడిని రంజింపజేయాలనే నటిస్తాడని చెప్పాడు. 'కొన్ని సార్లు అందులో విజయం సాధించవచ్చు, ఇంకొన్నిసార్లు విఫలం కావచ్చు. అలా అని కెరీర్ ముగిసిపోయిందంటే ఎలా?' అని ప్రశ్నించాడు. ప్రతి సినిమా విడుదల సందర్భంగా సంతోషంగా ఉంటుంది. అది ప్రేక్షకుల్ని అలరిస్తే ఆ ఆనందం రెట్టింపు అవుతుంది. అది విఫలమైతే బాధగా ఉంటుందని షారూఖ్ చెప్పాడు.