: ఫిర్యాదు చేశా.. రాష్ట్రపతి సానుకూలంగా స్పందించారు: ఢిల్లీలో వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీకి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాము చేసిన ఫిర్యాదుపై రాష్ట్రపతి సానుకూలంగా స్పందించారని అన్నారు. తాను ఢిల్లీ పర్యటనలో అపాయింట్ మెంట్ ఇచ్చిన ప్రతి ఒక్కరినీ కలుస్తానని అన్నారు. ఓ పార్టీ నుంచి గెలిచి మరో పార్టీలోకి వెళ్లిన వారిని మంత్రి వర్గంలోకి తీసుకునే పరిస్థితి కొనసాగుతుంటే ప్రజాస్వామ్యం అపహాస్యమవుతుందని ఆయన అన్నారు.
ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని తాను రాష్ట్రపతిని కోరినట్లు జగన్ తెలిపారు. ఢిల్లీలో తాము పలువురు బీజేపీ నేతలను కలవాలనుకుంటున్నామని అన్నారు. ఓటుకు కోట్ల డబ్బు ఇస్తూ చంద్రబాబు నాయడు అడ్డంగా దొరికిపోయారని, మద్యం నుంచి బొగ్గు, కాంట్రాక్టుల నుంచి జెన్‌కో దాకా అన్ని రంగాల్లో అవినీతి రాజ్యమేలుతోందని జగన్ అన్నారు. ఏపీలో అవినీతిని కాగ్ కూడా తప్పుబట్టిందని వ్యాఖ్యానించారు. ఈ వ్యవస్థలో మార్పు రాకపోతే ప్రజాస్వామ్యానికి విలువ ఉండదని ఆయన అన్నారు.