: వివాదాస్పదమైన పెప్సీ కొత్త యాడ్!
ప్రముఖ శీతల పానీయాల కంపెనీ పెప్సీ రూపొందించిన కొత్త యాడ్ వివాదాస్పదమైంది. యాడ్ వివరాల్లోకి వెళ్తే, ఫొటో షూట్ లో పాల్గొంటున్న ఓ మోడల్ ఆకస్మాత్తుగా నిరసన కార్యక్రమాలను నిర్వహిస్తున్న వ్యక్తులతో జతకడుతుంది. ఆ తర్వాత భద్రతా సిబ్బంది వద్దకు వెళ్లి పెప్సీ క్యాన్ అందిస్తుంది. ఆ డ్రింక్ ను తాగడంతో, సమస్యలన్నీ సద్దుమణిగిపోతాయి. ఈ యాడ్ పై అమెరికాలో దుమారం రేగింది. నిరసన కార్యక్రమాలను పెప్సీ చాలా తక్కువ చేసి చూపించిందని విమర్శలు చెలరేగాయి. అమెరికాలో జాతి వివక్షను వ్యతిరేకిస్తూ ఎన్నో ఏళ్లుగా ఆందోళనలు జరుగుతున్నాయి. అంతేకాదు, ప్రస్తుతం ట్రంప్ ను వ్యతిరేకిస్తూ కూడా నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో, తన యాడ్ ద్వారా పెప్సీ జనాలకు ఎలాంటి సందేశం ఇవ్వాలనుకుంటోందంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. దీంతో, తన కొత్త యాడ్ ను పెప్సీ తొలగించింది.