: నువ్వా నేనా.. బీజేపీ నేతల 'జై శ్రీరాం' నినాదాలు.. తృణమూల్ నేతల 'జై హనుమాన్' నినాదాలు
దేశ వ్యాప్తంగా శ్రీరామ నవమి వేడుకలు జరుపుకుంటూ సీతారాముడు, లక్ష్మణుడు, ఆంజేయుడి విగ్రహాలకి పూజలు నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. అయితే, పశ్చిమ బెంగాల్ వీధుల్లో మాత్రం కొత్త తరహా వేడుకలు కనిపించాయి. ఆ రాష్ట్ర అధికార తృణమూల్ కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ నేతలు పోటాపోటీగా రామ నవమి వేడుకలు జరిపిన తీరు అందరినీ ఆశ్చర్యంలో ముంచింది.
శ్రీరాముడంటే హనుమంతుడికి ఉండే అభిమానం ఎంతటిదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నమ్మకానికి, స్వామి భక్తికి మారు పేరుగా నిలిచిన హనుమంతుడు ఎప్పుడూ రాములోరి విగ్రహం ముందే దర్శనం ఇస్తూ ఆలయాల్లో, వేడుకల్లో కనిపించడం మనం చూస్తూ ఉంటాం. కానీ పశ్చిమబెంగాల్‌లో మాత్రం బీజేపీ పార్టీ నేతలు శ్రీరామ నవమి ఉత్సవం నిర్వహించగా, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేతలు మాత్రం ఒక్క హనుమంతుడికి మాత్రమే పండుగ నిర్వహించి వెరైటీ అనిపించారు.
రెండు పార్టీల నేతలు రోడ్లపైకి వచ్చి, బీజేపీ నేతలు శ్రీ రాం అనే నినాదాలు చేస్తే, మరో వర్గం జై హనుమాన్ అంటూ రెచ్చిపోయారు. బీజేపీ నిర్వహించే వేడుకల్లో ఆరెస్సెస్ కూడా కలిసింది. ఆయా ప్రాంతాల్లో ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా పెద్ద మొత్తంలో భద్రతను మోహరించారు. ఈ క్రమంలో పోలీసులతో పలువురు నేతలు వాగ్వివాదానికి కూడా దిగారు.