: సభకు వచ్చే ముందు నా భార్యను అడిగా... మంచిగా చెప్పింది!: సూపర్ జోక్ చెప్పి కడుపుబ్బ నవ్వించిన కేటీఆర్


తనను, కవితను నాయకులుగా, వక్తలుగా తీర్చిదిద్దేందుకు తమ తండ్రి ప్రయత్నించలేదని, తెలంగాణ ఉద్యమమే తమను నేతలుగా నిలిపిందని, నేటి ఆర్మూర్ జనహిత ప్రగతి సభలో వెల్లడించిన మంత్రి కేటీఆర్, ఓ సూపర్ జోక్ చెప్పి అందరినీ కడుపుబ్బా నవ్వించారు. "ఇటువంటి పెద్ద బహిరంగ సభల్లో పాల్గొనేముందు, ఇంత మంది పెద్దలు కూర్చున్న వేదికలపై ప్రసంగించే ముందు అందరు తెలివైన మొగోళ్లు చేసే పనే నేను కూడా చేసి వస్తా. ఇంట్లో బయలుదేరేటప్పుడు నా భార్యను అడిగినా. పెద్ద మీటింగ్ కు పోతున్నా. ఏం మాట్లాడాలని అడిగినా. ఆమె ఒకటే చెప్పింది. అందరికంటే ముందు నీకు మైకిస్తే... నా తరువాత పోచారం శ్రీనివాసరెడ్డిగారు, డీ శ్రీనివాస్ గారు, కవిత మాట్లాడుతారు. చానా బాగా మాట్లాడతారు అని చప్పుడు చెయ్యక కూర్చో. మధ్యలో మాట్లాడే అవకాశం వస్తే, నాకంటే ముందు మాట్లాడిన జీవన్ బ్రహ్మాండంగా మాట్లాడిండు. తరువాత మాట్లాడే శీనన్న ఇంకా బాగా మాట్లాడుతడు అని చప్పుడు చెయ్యక కూర్చో. ఆఖర్న మాట్లాడే అవకాశం వస్తే, ఇక అన్నీ వాళ్లు చెప్పిండ్రు. నాకు చెప్పెటందుకు ఏమీ లేదు అని చప్పుడు చెయ్యక కూర్చో అని చెప్పింది. ఇప్పుడు నా పరిస్థితి అట్లే ఉంది" అన్నారు. దీంతో సభా వేదికపై ఉన్న నాయకులతో పాటు, కార్యక్రమానికి హాజరైన వారంతా పగలబడి నవ్వుతూ కనిపించారు.

  • Loading...

More Telugu News