: ఎక్కడా రాజీపడను.. ఇతర రాష్ట్రాలతో పోటీ పడతా: ఏపీ కొత్త వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి
మంత్రిగా బాధ్యతలను నిర్వర్తించే క్రమంలో ఎక్కడా రాజీపడబోనని, ఇతర రాష్ట్రాలతో పోటీ పడతానని ఏపీ కొత్త వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. ఈ రోజు ఏపీ కొత్త మంత్రులు సచివాలయంలో బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ... ఏపీని అగ్రిహబ్‌గా మార్చుతామని చెప్పారు. రైతుల సమస్యలపై మంత్రివర్గ సమావేశంలో చర్చిస్తామని అన్నారు. ప్రధానంగా రాయలసీమ ప్రాంతంలో రైతుల ఇబ్బందులను తొలగిస్తామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఏపీ రైతులకు ఇస్తున్న సాయాన్ని మరింత పెంచాల్సి ఉందని అన్నారు. వ్యవసాయ శాఖను సమర్థంగా నిర్వర్తించి సీఎం తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని చెప్పారు. నూతన టెక్నాలజీని సమర్థవంతంగా ఉపయోగించుకుంటామని అన్నారు.