: వాళ్లు విగ్రహాన్ని ఆవిష్కరించారు... వీళ్లు ముసుగేసేశారు!
తూర్పుగోదావరి జిల్లాలోని ఉప్పలగుప్తంలో ఉన్న బాలయోగి పార్కులో బాబూ జగ్జీవన్ రామ్ విగ్రహావిష్కరణ వివాదాస్పదంగా మారింది. వాస్తవానికి మూడేళ్ల క్రితమే ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అయితే, మండలంలో ఎమ్మార్పీఎస్ రెండు వర్గాలుగా చీలిపోవడంతో... ఇంతవరకు విగ్రహావిష్కరణ జరగలేదు.
ఈ నేపథ్యంలో, ఓ వర్గం నిన్న జగ్జీవర్ రామ్ జయంతిని నిర్వహించింది. ఆయన చిత్రపటాన్ని ఉంచి, పూలమాల వేసి ఆయనకు నివాళి అర్పించింది. అనంతరం మరో వర్గం వచ్చి ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించింది. ఇదే సందర్భంలో డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప, ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు తదితరులు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం వారు వెళ్లిపోయారు.
ఈ నేపథ్యంలో, తమకు తెలియకుండా విగ్రహాన్ని ఆవిష్కరించిన విషయాన్ని తెలుసుకున్న మరో వర్గం మండిపడింది. వెంటనే అక్కడకు వచ్చి, విగ్రహానికి మళ్లీ ముసుగు వేసింది. దీంతో, మరో వర్గం మండిపడింది. జాతీయ నాయకుడి విగ్రహానికి ముసుగు వేయడం విద్రోహచర్య అంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.