: ఇంత అధికార దుర్వినియోగమా?: కేజ్రీవాల్ ను కడిగేసిన షంగ్లు కమిటి!


ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడిందని షంగ్లు అధ్యక్షతన మాజీ గవర్నర్ నజీబ్ జంగ్ నియమించిన త్రిసభ్య కమిటీ స్పష్టం చేసింది. ప్రభుత్వం ఎన్నో అక్రమాలకు పాల్పడిందని, నిబంధనలకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకుందని దుయ్యబట్టింది. పార్టీ కార్యాలయం కోసం ఆమ్ ఆద్మీ పార్టీకి భూమి కేటాయింపు, మంత్రి సత్యేంద్ర జైన్ కుమార్తెకు పదవి, పలువురు పార్టీ నేతలను సలహాదారులుగా నియమించుకోవడం వంటి విషయాలను తప్పుబట్టింది.

రాజ్యాంగానికి విరుద్ధంగా ప్రవర్తించిందని, లెఫ్టినెంట్ గవర్నర్ ను సంప్రదించకుండానే ప్రభుత్వానికి, ప్రజా ధనానికి నష్టం కలిగించే నిర్ణయాలు తీసుకుందని తెలిపింది. ఢిల్లీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ స్వాతి మలివాల్ కు నివాస భవనం ఇవ్వడాన్ని ప్రశ్నించింది. దాదాపు 100 పేజీల నివేదికను సిద్ధం చేస్తూ, అధికారం లేని అంశాల్లో కేజ్రీవాల్ కల్పించుకున్నారని, ఎల్జీ అనుమతి లేకుండా విదేశీ ప్రయాణాలు చేయడం చట్ట విరుద్ధమని, మంత్రులు నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘించారని షంగ్లు కమిటీ వెల్లడించింది. కాగా, ఈ కమిటీ అక్రమాలను గుర్తిస్తే, క్రిమినల్ కేసులను కేజ్రీవాల్ ఎదుర్కోక తప్పదని గతంలో నజీబ్ జంగ్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News