: నటుడు రితీశ్‌పై రూ.2.18 కోట్ల మోసం కేసు
మాజీ ఎంపీ, నటుడు రితీశ్‌పై రూ.2.18 కోట్ల మోసం కేసు నమోదైంది. పోలీసుల వివరాల ప్రకారం.. రితీశ్, అతనికి చెందినవారు తన కుమారుడి నుంచి రూ.2.18 కోట్లు తీసుకుని తిరిగి ఇవ్వకుండా మోసం చేశారంటూ 2015లో చెన్నైకి చెందిన ఆదినారాయణ్ సుబ్రమణియన్ అనే వ్యక్తి పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. అయితే తాను ఫిర్యాదు చేసినా పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో ఆయన మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు.
ఆదినారాయణన్ ఆరోపణలకు సరైన ఆధారాలు లేకపోవడంతో కేసును కొట్టివేయాల్సిందిగా నవంబరు 12, 2015లో ప్రభుత్వం తరపు న్యాయవాది కోర్టును కోరారు. అయితే కేసును దర్యాప్తు చేయాల్సిందిగా చెన్నై నేర విభాగం పోలీసులకు గతేడాది ఆగస్టులో కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసును అసిస్టెంట్ కమిషనర్ విచారించాలని సూచించింది. అయినా పోలీసుల్లో కదలిక లేకపోవడంతో ఆదినారాయణన్ మరోమారు కోర్టుకెక్కారు. హైకోర్టు ఉత్తర్వులను బేఖాతరు చేస్తున్నారంటూ పోలీస్ కమిషనర్‌పై కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. ధిక్కార పిటిషన్‌ను గతనెలలో విచారించిన కోర్టు నాలుగు వారాల్లో రితీశ్‌పై కేసు నమోదు చేయకుంటే పోలీసు అధికారులపై తగిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందంటూ న్యాయమూర్తి హెచ్చరించారు. దీంతో స్పందించిన పోలీసులు రితీశ్, ఆయన భార్య జ్యోతీశ్వరి తదితరులపై కేసు నమోదు చేశారు.