: యోగి సర్కారుకు హైకోర్టు అక్షింతలు.. ఆహార విక్రయం జీవించే హక్కులో భాగమని వ్యాఖ్య
ఉత్తరప్రదేశ్‌లోని యోగి సర్కారుకు హైకోర్టు ధర్మాసనం అక్షింతలు వేసింది. ఆహారపు అలవాట్లు, ఆహార విక్రయం అనేవి జీవించే హక్కులో భాగమని, అక్రమ కబేళాలపై చర్యల పేరుతో ఆ హక్కుకు భంగం కలిగించేలా వ్యవహరించరాదని పేర్కొంది. అక్రమ కబేళాలపై కొరడా ఝళిపిస్తున్న యోగి సర్కారు మాంసం విక్రేతల లైసెన్సులను కూడా పునరుద్ధరించడం లేదు. దీంతో సయీద్ అనే మాంసం వ్యాపారి అలహాబాద్ హైకోర్టు లఖ్‌నవ్ బెంచ్ ను ఆశ్రయించారు. తన లైసెన్స్ గత నెల 31తో ముగిసిందని, దానిని పునరుద్ధరించాలని కోరుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని తన పిటిషన్లో పేర్కొన్నారు.
కేసును విచారిస్తున్న జస్టిస్ అమరేశ్వర్ ప్రతాప్ సాహి, జస్టిస్ సంజయ్ హర్కౌలీలతో కూడిన ధర్మాసనం.. ఏ ఆదేశాల ప్రకారం అక్రమ కబేళాలు, మాంసం విక్రయాలపై చర్యలు తీసుకుంటున్నారో తెలపాలని గత నెల 28న ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించడం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత అని, ఆరోగ్యంగా ఉండడానికి ఉపకరించే ఆహారాన్ని తప్పు ఎంపికగా భావించకూడదని ఏప్రిల్ 3న జరిగిన విచారణలో హైకోర్టు పేర్కొంది. అక్రమ కబేళాలపై నిషేధం పేరుతో దానిని అడ్డుకోకూడదని స్పష్టం చేసింది. అయితే మాంసం వినియోగాన్ని నిషేధించడం, జంతు వధశాలలను మూసివేయడం ప్రభుత్వ ఉద్దేశం కాదని, అక్రమ కబేళాలను మూసివేయడం, కబేళాల పనితీరును క్రమబద్ధీకరించడమే ప్రభుత్వ ఉద్దేశమని ప్రభుత్వం తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. కాగా సయీద్ పిటిషన్‌తోపాటు అదే అంశంపై దాఖలైన పిటిషన్ల విచారణను ఈనెల 13కు వాయిదా వేసింది.