: కమల్ కు ఆ నలుగురే జీవితం.. వారిలో ముగ్గురు లేరు.. తోడుగా మేముంటాము!: రజనీకాంత్
'కమలహాసన్ కోపాన్నిఅదుపులో పెట్టే నలుగురు వ్యక్తుల్లో ముగ్గురు చనిపోయారు.. అయినా కమల్ కు ఇప్పుడు తోడుగా మేమందరం ఉన్నాం' అని తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ అన్నారు. కమలహాసన్ చిన్న అన్నయ్య చంద్రహాసన్ కొన్ని రోజుల క్రితం మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చెన్నైలోని కామరాజ్ అరంగంలో ఈ రోజు సంతాప సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు హాజరైన రజనీకాంత్ మాట్లాడుతూ, చంద్రహాసన్ గురించి చాలా విన్నాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా. కమల్ హాసన్ లా షార్ట్ టెంపర్ ఉన్న వ్యక్తిని నేను చూడలేదు. మీరందరూ ఆయనలోని పది శాతం కోపాన్నే చూశారు. నేను మాత్రం ఆయనలో వంద శాతం కోపాన్ని చూశాను. అందుకే, కమల్ తో నేను జాగ్రత్తగా వ్యవహరిస్తాను. కమల్ కోపాన్ని ఆయన పెద్దన్న చారుహాసన్, చిన్న అన్న చంద్రహాసన్ అదుపులో పెట్టేవారు. కమల్ కు బాలచందర్ సార్, అనంత్, చారుహాసన్ అన్న, చంద్రహాసన్ అన్నలే జీవితం. ఈ నలుగురిలో ముగ్గురు లేరు. ఈ బాధను కమల్ ఎలా అధిగమిస్తాడోనని ఆవేదన చెందుతున్నా. అయినా కమల్ కు తోడుగా మేమున్నాం’ అని అన్నారు.