: పవన్, రాజమౌళి, పూరీ, వర్మ, ఇండియన్ ఐడల్ రేవంత్ లపై కేఏ పాల్ ట్వీట్లు.. నవ్వుకుంటున్న జనం!
తనదైన శైలిలో వ్యాఖ్యలు చేసే క్రైస్తవ మత గురువు కేఏ పాల్ గుర్తుండే ఉంటారు. గత ఎన్నికల్లో మోదీ గెలుపునకు, అమెరికాలో ట్రంప్ విజయం సాధించడానికి తాను చేసిన ప్రార్థనలే కారణమని పాల్ గతంలో వ్యాఖ్యానించడం తెలిసిందే. తాజాగా, ఇండియన్ ఐడల్ టైటిల్ విజేత రేవంత్, పవన్ ఇజమ్, దర్శకులు రాజమౌళి, పూరీ జగన్నాథ్.. ఇలా పలువురిపై కేఏ పాల్ ఇటీవల ట్వీట్లు చేశారు. ఆయా ట్వీట్లలో పాల్ ఏమన్నారంటే..
* పూరీ జగన్నాథ్ చిత్రం ‘రోగ్’ ఇప్పుడే చూశాను. ఈ సినిమాలో కథ ఉండి ఉంటే బాగుండేది. పూరీ జగన్నాథ్ కోసం అమెరికాలోని ఓ ఫిల్మ్ స్కూల్ లో ఓ సీటు బుక్ చేశాను. నేను వీసా పంపిస్తాను. పెట్టె బేడా సర్దుకుని ఇక్కడికి వచ్చేశాయ్. సినిమా ఎలా తీయాలో నేర్చుకోవచ్చు. ఏమంటావ్ పూరీ? గాడ్ బ్లెస్ యూ!
* దయచేసి, ‘పాలిజమ్’ను ‘పవనిజమ్’తో పోల్చవద్దు. పవనిజమ్ అనేది రాష్ట్ర స్థాయిలో మాత్రమే ఫేమస్ అయింది. అదే, పాలిజమ్ విషయానికి వస్తే.. ప్రపంచ వ్యాప్తంగానే కాదు విశ్వవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు గాంచింది.
* దర్శకుడు రాజమౌళి బాహుబలి-2 చిత్రం ప్రీ-రిలీజ్ వేడుక కోసం కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఉండొచ్చు. కానీ, మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవానికి కోట్ల రూపాయలు ఖర్చు చేసిన టీడీపీ నిన్ను అధిగమించింది.
* ఐక్యూ విషయానికి వస్తే రామ్ గోపాల్ వర్మ ప్రపంచంలోనే టాప్ 3లో ఉంటాడు. నా విషయానికి వస్తే, ఐస్ స్టీన్ ఐక్యూ స్థాయిని నేనెప్పుడో దాటేశాను.
* బాలీవుడ్ లో అవకాశాలు రావాలంటే ఏం చేయాలని రేవంత్ నన్ను అడిగాడు. ఇండియన్ ఐడల్ పోటీల్లో పాల్గొనమని చెప్పాను. ‘నెగ్గుతానా? అని రేవంత్ అడిగాడు.. పోటీలో పాల్గొని టైటిల్ పట్టుకెళ్లమన్నా’ అంటూ కేఏ పాల్ చేసిన ట్వీట్లు నవ్వులు తెప్పిస్తున్నాయి.