: కాంగ్రెస్ లో పదవి అనుభవించి... బీజేపీలో చేరడం ఫిరాయింపు కాదా?: పురంధేశ్వరికి బుద్ధా వెంకన్న సూటి ప్రశ్న
కాంగ్రెస్ పార్టీలో ఉండగా కేంద్ర మంత్రి పదవులు అనుభవించిన మాజీ కేంద్ర మంత్రి పురంధేశ్వరి, ఆ తర్వాత బీజేపీలో చేరడం పార్టీ ఫిరాయింపు కిందికి రాదా? అని టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలో చేరిన నేతలకు మంత్రి పదవులు ఇవ్వడంపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, ప్రధాని నరేంద్ర మోదీకి పురంధేశ్వరి లేఖలు రాసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమెకు బహిరంగ లేఖ రాసిన బుద్ధావెంకన్న ఆ లేఖలో, పార్టీ ఫిరాయింపులపై పురంధేశ్వరి మాట్లాడడం విడ్డూరంగా ఉందని అన్నారు. జగన్ అవినీతి, జగన్ సూట్ కేసు కంపెనీలపై ఏనాడైనా ప్రశ్నించారా? అని నిలదీశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలో చేరిన మీరు వచ్చే ఎన్నికల నాటికి జగన్ పార్టీ అయిన వైఎస్సార్సీపీలో చేరుతారని ప్రజలు అనుకుంటున్నారని, దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీపై ఉందని ఆయన తెలిపారు.