: నీచంగా మాట్లాడుతున్నారని పోలీసుల ఎదుటే విషం తాగిన యువతి
వివాహం నిశ్చయమైన తరువాత, తనపై లేనిపోని ప్రచారం చేస్తూ, నీచంగా మాట్లాడుతున్నారని ఆరోపిస్తూ, తీవ్ర మనస్తాపానికి గురైన ఓ యువతి పోలీసు స్టేషన్లో విషం తాగి ఆత్మహత్యకు ప్రయత్నించిన ఘటన కన్నడనాట కలకలం సృష్టించింది. మరిన్ని వివరాల్లోకి వెళితే, బెళగావి పోలీస్ స్టేషన్ పరిధిలోని గణేశపుర కాలనీకి చెందిన ఓ యువతికి ఇటీవల ముంబైకి చెందిన యువకుడితో వివాహం కుదిరింది. ఆమె అంటే గిట్టనివారు కొంతమంది, ఆమె నడవడిక మంచిది కాదని ప్రచారాన్ని సాగిస్తున్నారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన యువతి, స్టేషన్ కు వచ్చి, విషయం చెప్పి, పోలీసుల ముందే విషం తాగింది. వెంటనే స్పందించిన పోలీసులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ప్రాణాలకు అపాయమేమీ లేదని, కేసును దర్యాఫ్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.