: కీలక అడుగు... 10 వేల మంది శరణార్థ ముస్లింలను జమ్మూ కాశ్మీర్ నుంచి పంపించివేయాలని మోదీ నిర్ణయం!
జమ్మూ కాశ్మీరులో ఎంతో కాలంగా శరణార్థులుగా కాలం గడుపుతున్న 10 వేల మందికి పైగా రోహింగ్యా ముస్లింలను తిరిగి మయన్మార్ కు పంపించాలని మోదీ సర్కారు కీలక నిర్ణయం తీసుకోనుంది. సాధ్యమైనంత త్వరగా వారిని గుర్తించి, దేశం నుంచి పంపించేందుకు తీసుకోవాల్సిన చర్యల దిశగా ఉపక్రమించాలని జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వానికి కేంద్రం సూచించింది. కాగా, దశాబ్దాల నాడు మయన్మార్ నుంచి దేశంలోకి వచ్చిన రోహింగ్యా ముస్లింలలో అత్యధికులు జమ్మూ, సాంబా జిల్లాల్లో ఉంటున్నట్టు సమాచారం.
వీరంతా చట్ట వ్యతిరేకంగా భారత్ - బంగ్లాదేశ్, భారత్ - మయన్మార్ సరిహద్దులు దాటడం లేదా బంగాళాఖాతం మీదుగా ప్రయాణించి భారత్ కు వచ్చారు. వీరిని తిరిగి పంపే దిశగా, కేంద్ర హోం శాఖ కార్యదర్శి రాజీవ్ మహర్షి, జమ్మూ కాశ్మీర్ చీఫ్ సెక్రటరీ బ్రజ్ రాజ్ శర్మ, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఎస్పీ వెయిద్ ల మధ్య కీలక చర్చలు సాగాయి. రోహింగ్యా ముస్లింలను ఎలా గుర్తించాలన్నదే పెను సమస్యని, దీనికి మార్గాన్వేషణ జరుగుతోందని హోం శాఖ అధికారి ఒకరు తెలిపారు. జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వ లెక్కల ప్రకారం, సుమారు 10 వేల మంది రాష్ట్రంలో అక్రమంగా ఉంటుండగా, దేశవ్యాప్తంగా దాదాపు 40 వేల మంది వరకూ ఉండవచ్చని అంచనా. వీరిలో కొందరు ఐరాస శరణార్థ సంఘంలో రిజిస్టర్ చేసుకున్నా, వారిని గుర్తించేందుకు భారత్ నిరాకరిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే.