: రాజస్థాన్ లో దారుణం... గో సంరక్షకుల దాడిలో ముస్లిం యువకుడి మృతి
రాజస్థాన్ లో మరో దారుణం జరిగింది. ఆవులను స్మగ్లింగ్ చేసి తీసుకువెళుతున్నావని ఆరోపిస్తూ, కొంతమంది గో సంరక్షకులు దాడి చేసి దారుణంగా కొట్టడంతో ఓ ముస్లిం యువకుడు మరణించాడు. ఈ ఘటన అల్వార్ జిల్లా పరిధిలో జరిగింది. కలెక్టర్ ముక్తానంద్ అగర్వాల్ చెప్పిన వివరాల ప్రకారం, పెహ్లూ ఖాన్ అనే 35 ఏళ్ల వ్యక్తి మరికొందరితో కలసి ఆరు వాహనాల్లో గోవులను తరలించే ప్రయత్నం చేశాడు.
విషయం తెలుసుకున్న కొందరు యువకులు అతడిని అడ్డగించి, దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఖాన్ కు తీవ్రగాయాలు కాగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. ఈ దాడిలో మరికొందరికి కూడా గాయాలు కాగా, వారంతా ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. వీరంతా హర్యానా రాష్ట్రంలోని నుహ్ జిల్లాకు చెందిన ముస్లింలని తెలుస్తోంది. రాజస్థాన్ జంతు చట్టాల ప్రకారం, గోవులను వధ్యశాలలకు తరలించడం నిషేధం. కాగా, ఈ ఘటన తరువాత పోలీసులు ఆరుగురు గో సంరక్షకులులతో పాటు, మరో 200 మందిపై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.