: ములాయం చిన్న కొడుకు, కోడలు బీజేపీలో చేరతారన్న వార్తల నేపథ్యంలో... ఆదిత్యనాథ్ తో శివపాల్ యాదవ్ చర్చలు
ఉత్తరప్రదేశ్ లో బీజేపీ ఘనవిజయం సమాజ్ వాదీ పార్టీ సుప్రీమో ములాయం సింగ్ యాదవ్ కుటుంబంలో చీలికను తెచ్చిందని, ఆయన చిన్న కుమారుడు ప్రతీక్, కోడలు అపర్ణలు బీజేపీలో చేరవచ్చని వార్తలు వస్తున్న వేళ, ఎవరూ ఊహించని రీతిలో ములాయం సింగ్ సోదరుడు శివపాల్ యాదవ్, సీఎం యోగి ఆదిత్యనాథ్ ను కలవడం కొత్త చర్చలకు దారితీసింది. వీరిద్దరి మధ్యా ఏం మాటలు నడిచాయన్న విషయం తెలియనప్పటికీ, ఆదిత్యనాథ్ సీఎం కాగానే అపర్ణ, ప్రతీక్ లు వెళ్లి కలవడం, ఆపై వారింటికి సీఎం రావడం, ఇప్పుడు శివపాల్ సైతం ఆదిత్యనాథ్ ను కలవడం రాబోయే కాలంలో జరగబోయే రాజకీయ మార్పులకు సంకేతాలని విశ్లేషకులు భావిస్తున్నారు.
కాగా, తాను నేతాజీ వెంటే ఉంటానని గత వారంలో శివపాల్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో అఖిలేష్ పై విమర్శలు గుప్పిస్తూ, తండ్రికి విధేయుడిగా ఉండలేని ఓ వ్యక్తి మరొకరికి గానీ, ప్రజలకు గానీ విధేయుడిగా ఎలా ఉంటాడని ప్రశ్నించారు. 403 అసెంబ్లీ సీట్లున్న యూపీలో ఎస్పీ, కాంగ్రెస్ కూటమి కేవలం 47 సీట్లకు మాత్రమే పరిమితమైన సంగతి తెలిసిందే.