: మధ్యప్రదేశ్ లో ట్యాంపరింగ్ అయిన ఈవీఎం సృష్టించిన కలకలం... కారణం చెప్పిన భన్వర్ లాల్
మధ్యప్రదేశ్ లో రెండు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికల జరగనున్న నేపథ్యంలో, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ లను వివిధ పార్టీ ఏజంట్ల ముందు ప్రదర్శించిన వేళ, ఎవరికి ఓటు వేసినా బీజేపీకే పడుతున్నట్టు వెల్లడికావడం సంచలనం కలిగించగా, తప్పు ఎక్కడ జరిగిందన్న విషయాన్ని పరిశీలించేందుకు ఏపీ ఎన్నికల అధికారి భన్వర్ లాల్ స్వయంగా వెళ్లిన సంగతి తెలిసిందే. ఈవీఎంల ట్యాంపరింగ్ అన్నది జరగదని, ఎన్నికల్లో పోటీ పడుతున్న అభ్యర్థుల సందేహాలను తీర్చేందుకు 150 ఈవీఎంల డిమాన్ స్ట్రేషన్ కు ఏర్పాట్లు చేశామని భన్వర్ లాల్ తెలిపారు. ఇక ట్యాంపర్ అయినట్టు చెప్పబడుతున్న ఈవీఎం ఎందుకలా ప్రవర్తించిందన్న విషయాన్ని తమ సాంకేతిక నిపుణులు గుర్తించారని తెలిపారు. ఇక్కడ చూపిన ఈవీఎం ఇటీవలి ఉత్తరప్రదేశ్, కాన్పూర్ పరిధిలోని గోవిందనగర్ అసెంబ్లీ సెగ్మెంట్ లో వాడినదని ఆయన చెప్పారు.
వీవీపీఏటీ (వోటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయిల్)లో చెరిపేయాల్సిన డేటాను తొలగించలేదని, దీని కారణంగానే సాంకేతికంగా గోవిందనగర్ లో పోటీపడ్డ వారి పేర్లే ఇందులో ఉండిపోయాయని, ఈ కారణంగానే మరొకరికి ఓటు వేసినా, అది ఆ స్థానంలో గతంలో ఉన్న బీజేపీకి ఓటు వచ్చినట్టు చూపిందని, విధుల్లో నిర్లక్ష్యం వహించారన్న కారణంతో ముగ్గురిని బదిలీ చేశామని, మరో 19 మందిపై విచారణ ప్రారంభమైందని తెలిపారు. వాస్తవానికి ఈవీఎంల ఫస్ట్ లెవల్ చెక్ లో పాత సమాచారాన్ని చెరిపేశారా? లేదా? అన్న విషయాన్ని పరిశీలించాల్సి వుంటుందని, ఈ సమస్య కేవలం అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఏర్పడిందే తప్ప, ట్యాంపరింగ్ లేదని స్పష్టం చేశారు. ఏ ఈవీఎంలో ఎన్ని ఓట్లు వేశారన్న విషయాన్ని లెక్కింపు సమయంలో పరిశీలిస్తామని, అందులో నమోదైన ఓట్లతో ఆ సంఖ్య సరిపోతేనే ఫలితం వెలువడుతుందని భన్వర్ లాల్ తెలిపారు. ఈవీఎంలపై ఎటువంటి అనుమానాలూ అక్కర్లేదని తెలిపారు.