: రాకీ సావంత్ అరెస్టు కాలేదు...ఆమె ఆచూకీ లేదు: లూథియానా పోలీస్ కమిషనర్
వాల్మీకి మహర్షిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బాలీవుడ్ ఐటెం గర్ల్ రాఖీ సావంత్ అరెస్టైందంటూ వచ్చిన వార్తలను లూథియానా పోలీసు కమిషనర్ కున్వర్ విజయ్ ప్రతాప్ సింగ్ ఖండించారు. ఆమెను అరెస్టు చేయలేదని ఆయన స్పష్టం చేశారు. ఆమెను అదుపులోకి తీసుకునేందుకు లూథియానా నుంచి ముంబై వెళ్లిన పోలీసు బృందానికి ఆమె ఆచూకీ దొరకలేదని ఆయన ప్రకటించారు. దీంతో ఆమెను ఇంకా అరెస్టు చేయలేదని ఆయన స్పష్టం చేశారు.
అయితే మీడియాలో ఆమెను అదుపులోకి తీసుకున్నట్టు వార్తలు వచ్చాయని ఆయన మండిపడ్డారు. కాగా, గత ఏడాది ఒక టీవీ ఛానెల్ లో మాట్లాడిన సందర్భంగా రాఖీ సావంత్ వాల్మీకి వర్గానికి చెందిన వారి మనోభావాలను గాయపరిచారంటూ కేసు నమోదైంది. దీనిపై విచారణకు మార్చి 9న న్యాయస్థానానికి హాజరుకావాల్సి ఉండగా, పలు మార్లు ఆమె గైర్హాజరయ్యారు. దీంతో ఆమెకు న్యాయస్థానం అరెస్టు వారెంట్ జారీ చేసింది.