: లోకేష్ ను ‘మంత్రి గారూ!’ అంటూ సంబోధించిన చంద్రబాబు!
మంత్రులందరితో వ్యవహరించినట్టే తనయుడు నారా లోకేష్ నూ గౌరవిస్తూ ‘మంత్రి గారూ!’ అంటూ ఏపీ సీఎం చంద్రబాబు తన సంబోధించారు. అమరావతిలో రాష్ట్ర ఉపాధి హామీ మండలి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి చంద్రబాబు, లోకేష్ హాజరయ్యారు. లోకేష్ పాల్గొన్న తొలి సమావేశంలో ఆసక్తికర సన్నివేశాలు చోటు చేసుకున్నాయి. చంద్రబాబు చెప్పిన విషయాలను లోకేష్ ఓ నోట్ బుక్ లో రాసుకున్నారు. ఉపాధి హామీ అమల్లో ఇబ్బందులను జడ్పీ చైర్మన్లు ప్రస్తావించగా, ఆ సమస్యలను పరిష్కరించాలని లోకేష్ ను చంద్రబాబు ఆదేశించారు.
‘పెద్ద శాఖ అనుకున్నా కానీ, చాలా లోతైన శాఖే. స్టడీ చేస్తానని’ ఈ సందర్భంగా లోకేష్ అన్నారు. ఈ సమావేశంలో సుమారు అరగంట పాటు లోకేష్ ప్రసంగించడం గమనార్హం. ఉపాధి హామీ అమలుపై సీఎం సూచనలు, ఆలోచనలను పొందుపరిచి నోట్ రూపొందించాల్సిందిగా అధికారులను లోకేష్ ఆదేశించారు. కాగా, ఉపాధి హామీ కూలీల వేసవి భృతి 30 శాతం పెంచుతున్నట్ల్లు చంద్రబాబు ప్రకటించారు. రూ.12 వేల కోట్ల మేర ఉపాధి పనులకు ప్రణాళికలు సిద్ధం చేయాలని, ఈ పనులు విజయవంతంగా నిర్వహించిన వారికి పురస్కారాలు అందజేస్తామని చంద్రబాబు పేర్కొన్నారు.