: ఏపీలో పార్టీ ఫిరాయింపులపై రాష్ట్రపతికి రఘువీరారెడ్డి లేఖ
ఆంధ్రప్రదేశ్లో జరిగిన పార్టీ ఫిరాయింపులపై ఫిర్యాదు చేస్తూ ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఈ రోజు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పార్టీ ఫిరాయింపుల చట్టానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఇటువంటి చర్యలను నిరోధించాలని అన్నారు. వైసీపీకి చెందిన 21 మంది ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేశారని ఆయన లేఖలో పేర్కొన్నారు. పార్టీ మారిన వారు తమ శాసన సభ్యత్వానికి రాజీనామా చేయకుండా కొనసాగుతున్నారని ఆయన తెలిపారు.
ఇటీవల జరిగిన మంత్రవర్గ విస్తరణలోనూ నలుగురు ఫిరాయింపు ఎమ్మెల్యేలు చేరారని ఆయన పేర్కొన్నారు. నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాల్సిన గవర్నర్, స్పీకర్ కూడా దీనిపై సరైన రీతిలో స్పందించడం లేదని చెప్పారు. ఈ విషయంపై రాష్ట్రపతి జోక్యం చేసుకోవాలని ఆయన కోరారు.