: పదో తరగతి అమ్మాయిపై పలుమార్లు అత్యాచారం చేసిన హెడ్మాస్టర్
విద్యాబుద్ధులు నేర్పి, విద్యార్థుల బంగారు భవితకు బాటలు వేయాల్సిన ఓ హెడ్మాస్టర్ అత్యంత దారుణానికి ఒడిగట్టాడు. పదో తరగతి చదువుతున్న ఓ అమ్మాయికి మాయ మాటలు చెప్పి, ఆమెపై పలుమార్లు అత్యాచారం చేశాడు. ఈ దారుణ ఘటన ఒడిశాలోని కోరాపుట్ జిల్లాలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే, మార్చి 19న ఈ ఘటన జరిగింది. ఎస్సీ, ఎస్టీ ఆశ్రమ పాఠశాలలో హెడ్మాస్టర్ గా పని చేస్తున్న ఓ వ్యక్తి (57) పదో తరగతి చదువుతున్న బాలికను తన గదికి రప్పించుకున్నాడు. అప్పటి నుంచి ఆమెపై అత్యాచారం జరుపుతూనే ఉన్నాడు.
ఈ క్రమంలో తమ కూతురు కనిపించడం లేదంటూ ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. హెడ్మాస్టర్ మీద అనుమానం వచ్చిన పోలీసులు... అతడి ఫోన్ కాల్స్ ఆధారంగా ట్రేస్ చేసి, బాలిక ఎక్కడుందో గుర్తించారు. తనను పెళ్లి చేసుకుంటానని హెడ్మాస్టర్ చెప్పాడని... తనపై అనేక సార్లు లైంగికదాడికి పాల్పడ్డాడని పోలీసులకు బాధితురాలు తెలిపింది. దీంతో, హెడ్మాస్టర్ పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు... అతడిని అరెస్ట్ చేశారు. వైద్య పరీక్షల నిమిత్తం ఇద్దరినీ ఆసుపత్రికి తరలించారు. మరోవైపు, ఇంత దారుణానికి ఒడిగట్టిన హెడ్మాస్టర్ ను విద్యాశాఖ అధికారులు సస్పెండ్ చేశారు.