: లంచమడిగితే దుమ్ము దులపండి: కేటీఆర్
డబుల్ బెడ్ రూం ఇళ్ల లబ్దిదారుల ఎంపికలో ఏ అధికారి అయినా, లేదా టీఆర్ఎస్ పార్టీ నేతైనా ముడుపులు కోరితే వారి దుమ్ము దులపాలని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. ఈ ఉదయం మహబూబ్ నగర్ జిల్లా దివిటిపల్లిలో పర్యటించిన ఆయన, డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. పేదలు ఆత్మగౌరవంతో బతకాలన్న లక్ష్యంతోనే ఈ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టామని, ఎవరైనా తప్పు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. రూ. 18 వేల కోట్లు ఖర్చు చేసి 2.70 లక్షల ఇళ్లను నిర్మిస్తున్నామని చెప్పిన ఆయన, ఒక్కో ఇంటికి రూ. 6 లక్షలను వెచ్చిస్తున్నామని అన్నారు. అధికారంలోకి వచ్చిన 33 నెలల్లో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను చేపట్టి, పేదల జీవితాల్లో వెలుగులను నింపిన దమ్మున్న నాయకుడు కేసీఆర్ అని, ఆయన అడుగు జాడల్లో బంగారు తెలంగాణను సాధించి చూపుతామని చెప్పారు. ఇళ్లు ఇప్పిస్తామని ఎవరైనా లంచం అడిగితే తగిన బుద్ధి చెప్పాలని, తన దృష్టికి ఈ తరహా విషయాలు తీసుకువస్తే, కఠిన చర్యలు తీసుకుంటానని కేటీఆర్ హామీ ఇచ్చారు.