: ఆమాత్రం పెంచకుంటే నిపుణులంతా వెళ్లిపోతారు: నారాయణమూర్తి విమర్శలపై ఇన్ఫీ స్పందన
ఇన్ఫోసిస్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ప్రవీణ్ రావుకు భారీగా వేతనాన్ని పెంచి, సంస్థ వ్యవస్థాపకులు నారాయణమూర్తి నుంచి విమర్శలను ఎదుర్కొన్న బోర్డు వివరణ ఇచ్చింది. సంస్థ లీడర్ షిప్ లో నిపుణులైన వారిని కొనసాగించాలంటే, ఆమాత్రం వేతన పెంపు తప్పదని ఒక ప్రకటనలో సంస్థ డైరెక్టర్లు అభిప్రాయపడ్డారు. దీర్ఘకాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే ఈ నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేసింది. సంస్థను ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రవీణ్ ఎంతో కృషి చేస్తున్నారని, ఆయన భాగస్వామ్యంలో గత మూడేళ్లలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నామని సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ విశాల్ సిక్కా వెల్లడించారు. అటువంటి వారు ఉన్నతోద్యోగులుగా కొనసాగాలని కోరుకునే ఏ సంస్థ అయినా వేతనాలు పెంచాల్సిందేనని ఆయన అభిప్రాయపడ్డారు. సంస్థ వాటాదారుల్లో మూడింట రెండు వంతుల మంది ప్రవీణ్ రావు వేతన పెంపును సమర్థించారని గుర్తు చేశారు. 2020 నాటికి 20 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని నమోదు చేసేందుకు ప్రణాళికలు రూపొందించామని, లక్ష్యాలను చేరుకుంటామన్న నమ్మకం తమకుందని తెలిపారు.