: ఆ విశ్వవిద్యాలయాల్లో చదువు తప్ప అన్నీ ఉంటున్నాయి: ఎంపీ రూపా గంగూలీ
జాదవ్‌పూర్ యూనివర్సిటీలో నిర్వహించిన ఓ సెమినార్ సందర్భంగా పలువురు విద్యార్థులు ఆజాదీ అంటూ దేశవ్యతిరేక నినాదాలు చేశారు. బంగ్లాదేశ్‌లో మైనారిటీల స్థితగతులపై చర్చించేందుకు ఆ యూనివర్సిటీలో ఈ సెమినార్ ఏర్పాటు చేసిన సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ సెమినార్‌కి బంగ్లాదేశ్, భారత్‌ల నుంచి పలువురు నాయకులతో సహా త్రిపుర గవర్నర్ తథగాత రాయ్ కూడా వచ్చారు. ఈ సందర్భంగా తథగాత రాయ్ మాట్లాడుతూ బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై దాడుల నియంత్రణ గురించి అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. అయితే, సెమినార్ ముగుస్తోందనగా కొందరు విద్యార్థులు నిరసన తెలపడంతో అలజడి చెలరేగింది.
ఈ అంశంపై బీజేపీ రాజ్యసభ సభ్యురాలు, మాజీ నటి రూపా గంగూలీ ఆగ్రహం వ్యక్తం చేశారు. బెంగాలీ యూనివర్సిటీల్లో చదువు తప్ప అన్నీ ఉంటున్నాయని ఆమె సెటైర్ వేశారు. విద్యార్థులు పేరు తెచ్చుకోవాలనుకుంటే మంచి పనులు చేయాలని ఆమె వ్యాఖ్యానించారు. వాళ్లు మంచి శాస్త్రవేత్తలయితే అది పశ్చిమ బెంగాల్‌తో పాటు మొత్తం దేశానికి మేలు కలుగుతుందని, అంతేగాని ఇటువంటి చర్యలకు పాల్పడకూడదని అన్నారు. జాదవ్‌పూర్ వర్సిటీలో గత ఏడాది నుంచి ఇటువంటి చర్యలు అధికమయ్యాయని, కొంతమంది విద్యార్థులకు చదువు తప్ప అన్నీ వచ్చని ఆమె ఆగ్రహం వ్యక్తంచేశారు.