: చేతులను వెనక్కి కట్టివేసి.. ఇంజనీరింగ్ చదువుతున్న యువతి, యువకుడి దారుణ హత్య
ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులను పలువురు దుండగులు దారుణంగా కొట్టి చంపిన ఘటన మహారాష్ట్రలో కలకలం రేపుతోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతులను సింగద్ ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన మెకానికల్ ఇంజనీరింగ్ విద్యార్థి, కంప్యూటర్ ఇంజనీరింగ్ చదువుతున్న మరో విద్యార్థినిగా గుర్తించారు. ఆ రాష్ట్రంలోని లోనావాలా, ఐఎన్ఎస్ శివాజీ సమీపంలోని కొండ మీద వీరి మృతదేహాలు నగ్నంగా పడివున్నాయని తెలిపారు. సదరు విద్యార్థి అహ్మద్ నగర్ కు చెందిన 22 ఏళ్ల ఓ యువకుడని, అతడు పుణేకు చెందిన తన స్నేహితురాలితో ఆ ప్రాంతానికి వచ్చిన సమయంలో పలువురు దుండగులు వారి చేతులను వెనక్కి కట్టివేసి, తలపై పదునైన ఆయుధంతో బలంగా కొట్టారని చెప్పారు.
ఈ ఘటనా స్థలంలో బాధితుడికి చెందిన బైక్ తో పాటు ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్సును స్వాధీనం చేసుకున్న పోలీసులు వాటి ఆధారంగా వారిని గుర్తించారు. హత్యకు గరైన యువతికి ఇటీవలే ఉద్యోగం వచ్చిందని, ప్రస్తుతం మృతులు ఇద్దరు ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నారని పోలీసులు చెప్పారు. హాస్టల్ నుంచి బయలుదేరే ముందు ఆ యువతి తన స్నేహితుడితో కలసి బయటికి వెళుతున్నానని స్నేహితురాల్లతో చెప్పి వెళ్లిందని అన్నారు.