: బాధ్యతలు చేపట్టకముందే పని మొదలుపెట్టిన లోకేష్.. అధికారులతో ఐదు గంటల సమావేశం!
తమ భవిష్యత్ నేతగా, కాబోయే ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నేతలు భావించే నారా లోకేష్, తనకు శాఖలను అప్పగించగానే రంగంలోకి దిగిపోయారు. పల్లె ప్రజల సంతోషం, పట్టణ వాసుల అభివృద్ధి అంశాలను బేరీజు వేసుకుని కీలకమైన పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి, ఐటీ శాఖలను చంద్రబాబు తన కుమారుడి చేతుల్లో పెట్టిన సంగతి తెలిసిందే. ఆ బాధ్యతలు అధికారికంగా స్వీకరించకుండానే, లోకేష్ తన శాఖలకు చెందిన అధికారులను పిలిచి సమావేశం నిర్వహించారు. భవిష్యత్ ప్రణాళికలు, పెండింగ్ లో ఉన్న అంశాలను గురించి అడిగి తెలుసుకున్నారు.
సుమారు 5 గంటలకు పైగా ఈ సమావేశం జరుగగా, తదుపరి చేపట్టాల్సిన పనులను గురించి సమాచారాన్ని అడిగారు. పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలకు కేంద్రం నిధులు దండిగా ఉండటం ఆయనకు కలిసొచ్చే అంశమని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇక యువతకు ముఖ్యంగా విద్యావంతులకు, పారిశ్రామికవేత్తలకు దగ్గరయ్యేందుకు ఐటీ శాఖ దోహదపడనుంది. సీఎం తనయుడిగా ఉన్న గుర్తింపు కంటే, సొంతంగా పేరు ప్రఖ్యాతులు సాధించాలన్న ఉద్దేశం ఆయనకు వున్నట్టు అధికారులు చెప్పడం గమనార్హం. కాగా, మంచి రోజు చూసుకుని లోకేష్ శాఖా పరమైన బాధ్యతలు చేపడతారని తెలుస్తోంది.