: భారతీయ సంప్రదాయాలను అవమానించిన వారు నన్ను చూసి భయపడుతున్నారు: యోగి
లౌకికవాదం పేరుతో ఎన్నో ఏళ్లుగా భారతీయ సంప్రదాయాలను ఎంతోమంది అవమానించారని... తాను ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన తర్వాత వారంతా భయపడుతున్నారని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. కాషాయం దుస్తులను ధరించడం తనకు ఇష్టమని... దేశంలో చాలా మందికి కాషాయం అంటే ఇష్టం లేదని చెప్పారు. తాను ధరించే కాషాయం దుస్తులను ప్రస్తావిస్తూ కొందరు తనపై లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు.
ముఖ్యమంత్రిగా తన పని తీరుతో అన్ని వర్గాల ప్రజలను మెప్పిస్తానని తెలిపారు. పెద్ద పెద్ద పదవులను చేపట్టడం కోసం తాను రాజకీయాల్లోకి రాలేదని... ప్రజలకు నిస్వార్థంగా సేవ చేయడానికే వచ్చానని చెప్పారు. దేశాన్ని కాపాడటమే తన ప్రథమ లక్ష్యమని చెప్పారు. రాష్ట్రం నుంచి గూండాయిజాన్ని తరిమేస్తానని చెప్పారు. సరికొత్త పారిశ్రామిక విధానాన్ని అమల్లోకి తీసుకొస్తానని... రాష్ట్రంలోని ఏ పరిశ్రమలో అయినా.. 90 శాతం మంది యూపీకి చెందిన ఉద్యోగులే ఉండేలా నిబంధనలు తీసుకొస్తామని తెలిపారు.