: రాష్ట్రాన్ని కాంగ్రెస్ గబ్బుమయం చేసింది.. మూడేళ్లలో పోయేదా అది?: మంత్రి కేటీఆర్
ఐదున్నర దశాబ్దాలపాటు పాలించిన కాంగ్రెస్ రాష్ట్రాన్ని గబ్బుమయం చేసిందని, ప్రస్తుతం దానిని తుడిచే పనిలో ఉన్నామని రాష్ట్రమంత్రి కేటీఆర్ విమర్శించారు. ఇది మూడేళ్లలోనే పోయే మురికి కాదని పేర్కొన్నారు. వికారాబాద్ జిల్లాలోని తాండూరులో సోమవారం నిర్వహించిన ‘జన జాగృతి ప్రజా సదస్సు’లో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ఆటలు ఇక సాగవని హెచ్చరించారు. వారెన్ని కుయుక్తులు పన్నినా ‘పాలమూరు-రంగారెడ్డి’ పథకం ద్వారా పాత రంగారెడ్డి జిల్లాకు నీరు అందించి తీరుతామని స్పష్టం చేశారు. ప్రాజెక్టును అడ్డుకునేందుకు పాలమూరులో కేసులు వేస్తున్న నేతలు, రంగారెడ్డి జిల్లాలో మాత్రం ప్రాజెక్టు కోసం పాదయాత్ర చేస్తున్నారని ధ్వజమెత్తారు. కేసీఆర్ మనసున్న మనిషని, ధర్నాలు, డిమాండ్లు, ఎర్ర జెండా విన్నపాలు లేకుండానే ప్రజలకు కావాల్సింది చేస్తున్నారని తెలిపారు. తెలంగాణలో టీఆర్ఎస్ తిరుగులేని శక్తిగా ఎదిగిందని, కాంగ్రెస్ పని ఖతమైందని కేటీఆర్ అన్నారు. కార్యక్రమంలో మంత్రి మహేందర్‌రెడ్డి కూడా మాట్లాడారు.