: అలిగిన నేతలూ! మంత్రి పదవులు అవే వస్తాయి..దిగులు పడకండి: టీడీపీ ఎమ్మెల్యే వర్మ
మంత్రి వర్గ విస్తరణలో పదవులు దక్కని ఏపీ టీడీపీ నేతలు అలక బూనడం, పార్టీ నేతలు వారిని బుజ్జగించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం ఎమ్మెల్యే వర్మ మాట్లాడుతూ, మంత్రి పదవులు రాలేదని దిగులు పడొద్దని, ఆ పదవులు తమ తలుపు తట్టి వాటంతట అవే వస్తాయంటూ వారికి ధైర్యం చెప్పారు. టీడీపీ అధినేత చంద్రబాబు గౌరవం తగ్గించే విధంగా వ్యాఖ్యలు చేయవద్దని, ‘మన కుటుంబం ఎంతో పార్టీ కూడా అంతే’ అనే విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు.
నాడు చంద్రబాబు పాదయాత్ర చేసినందువల్లే ఈ రోజున మనమందరం ఎమ్మెల్యేలయ్యామనే విషయాన్ని అలక బూనిన నేతలు గుర్తుంచుకోవాలన్నారు. ఇబ్బందులు ఏవైనా ఉంటే అధినేతతో మాట్లాడుకోవాలి తప్పా, పార్టీ పరువు బజారు కీడ్చడం సబబు కాదని అన్నారు. చంద్రబాబుకు అండగా నిలబడి, 2019 ఎన్నికల్లో పార్టీని మళ్లీ అధికారంలోకి తెచ్చుకునేందుకు కష్టపడదామని వర్మ అన్నారు.