: ఆ ప్రశ్నలకు సమాధానాలు కావాలి!: తనపై జరిగిన లైంగిక దాడిపై నోరు విప్పిన సినీ నటి భావన
తనపై జరిగిన లైంగిక వేధింపుల ఘటనపై ప్రముఖ సినీ నటి భావన నోరు విప్పింది. దానిపై మీడియాతో మాట్లాడుతూ, ఒక సినిమా హీరోయిన్ ను లొకేషన్ కు తీసుకెళ్లే డ్రైవర్ అంత దారుణానికి తెగబడతాడా? తెగబడగలడా? అంత ధైర్యం అతనికి ఎవరు? ఎలా? ఎక్కడ? ఎప్పుడు? ఇచ్చారు? అని ప్రశ్నించింది. అతని వెనుక ఎవరున్నారు? అన్నదానికి తన వద్ద సమాధానం లేదని తెలిపింది. తన శత్రువులే ఈ పని చేయించారా? అని తాను అనడం లేదని చెప్పింది. పోనీ ఇది కేవలం డబ్బు కోసమే చేశారా? అంటే జరిగిన ఘటనకు, డబ్బుకు పొంతన లేకుండా ఉందని భావన చెప్పింది.
జరిగిన ఘటనపై తనకు కొన్న అనుమానాలు, ఇంకొన్ని ప్రశ్నలు ఉన్నాయని చెప్పింది. వాటికి తనకు సంతృప్తికరమైన సమాధానం కావాలని డిమాండ్ చేసింది. సినిమాల్లో, రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరని అంటుంటారని చెప్పిన భావన, తనకు సినీ పరిశ్రమలో శాశ్వత శత్రువులు, మిత్రులు కూడా ఉన్నారని చెప్పింది. తన శత్రువులకు తాను క్షమాపణలు చెప్పనని స్పష్టం చేసింది. ఇలా తనకు జరిగినది మళ్లీ ఇంకెవరికైనా జరగొచ్చని అభిప్రాయపడింది. ఇవాళ తాను బయటపడి మాట్లాడితేనే రేపు ఇంకొకరు ధైర్యం చేయగలరని, అన్యాయాన్ని ప్రశ్నించగలరని తెలిపింది.
ఒకవేళ ఇలాంటి ఘటనలు ఎవరికైనా జరిగితే దాచుకోకుండా, వాటిపై మాట్లాడాలని సూచించింది. నేరస్తులు తప్పించుకునే అవకాశం ఎందుకు ఇవ్వాలి? అని అడిగింది. తనకు జరిగిన అన్యాయాన్ని దాచి ఉంటే కనుక, అది కేవలం 10 మందికి మాత్రమే తెలిసి ఉండేదని, అయితే అలా దాయడం వల్ల ఇంత ధైర్యంగా తలెత్తి మాట్లాడే అవకాశం ఉండేది కాదని స్పష్టం చేసింది. అంతే కాకుండా ఏదో తప్పు చేశానన్న భావనతో రాత్రుళ్లు నిద్ర పట్టి ఉండేది కాదని ఆవేదన వ్యక్తం చేసింది. జరిగిన దానిపై పోరాడుతున్నాను కనుకే తను ధైర్యంగా నిద్రపోగలుగుతున్నానని భావన చెప్పింది. ఈ విషయంలో ఎలా ముందుకెళ్లాలో తనకు పక్కా ప్రణాళిక ఉందని భావన తెలిపింది.