: కేటీఆర్, లోకేష్ మధ్య పోలిక తెస్తున్న శాఖలు!
తెలంగాణలో పంచాయతీరాజ్, మున్సిపల్, ఐటీ శాఖలను మంత్రి కేటీఆర్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఏపీ మంత్రి వర్గ విస్తరణలో స్థానం సంపాదించిన టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ కూడా మూడు శాఖల బాధ్యతలు చేపట్టారు. ఇద్దరూ ముఖ్యమంత్రుల కుమారులే కావడంతో ఇద్దరి మధ్య పోలికను ప్రజలు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ ఇప్పటికే పలు సందర్భాలలో అద్భుతమైన కార్యనిర్వహణ కలిగిన మంత్రిగా పేరొందారు. పలు సమస్యలకు ట్విట్టర్ ద్వారానే పరిష్కారాలు సూచిస్తూ, నేరుగా ప్రజలతో అనుసంధానమై ఉన్నారు. అంతే కాకుండా దేనిపైనైనా అనర్గళంగా మాట్లాడగల సామర్థ్యం ఆయన సొంతం.
ఈ నేపథ్యంలో నారా లోకేష్ మూడు శాఖల బాధ్యతలు చేపట్టనుండడంతో చాలామంది పోలిక తెస్తున్నారు. ఆయన కూడా విజయవంతమవుతారని టీడీపీ నేతలు గట్టిగా చెబుతున్నారు. గత ఎన్నికల్లో తండ్రికి చేదోడు వాదోడుగా ఉన్న లోకేష్...పలు కీలక నిర్ణయాలు తీసుకుని విజయవంతంగా అమలు చేశారని ఆ పార్టీ నేతలు చెబుతుంటారు. గతంలో వివిధ వ్యాపారాలను విజయవంతంగా నిర్వహించిన లోకేష్ సమర్థుడని, తన శాఖలపై తనదైన ముద్రవేసి పేరు తెచ్చుకుంటాడని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.