: మా రాష్ట్రంలో అది జీవనోపాధి... నెలకు 5000 నుంచి 8000 ఇస్తారు!: పక్కదారి పట్టిన కశ్మీరీ యువకులు
కశ్మీర్ లో అల్లర్లు చెలరేగిన ప్రతిసారి భారీ సంఖ్యలో యువకులు రోడ్ల మీదకి వచ్చి, ముఖాలకు ఖర్చీఫ్ లు కట్టుకుని పోలీసులు, భద్రతా దళాలపైకి రాళ్లు విసురుతూ కనిపిస్తారు. వారంతా ఆందోళనతోనో, ఆగ్రహంతోనో అలా రోడ్లపైకి వచ్చి రాళ్లు విసురుతున్నారంటే మనం పొరపాటు పడ్డట్టే... ఎందుకంటే వారు ఆందోళనతోనో లేక ఆగ్రహంతోనే అలా రాళ్లు విసరడం లేదు. అది వారి జీవనోపాధి. ఇలా చేసేందుకు వారికి నెలకు 5000 రూపాయల నుంచి 8000 రూపాయలు అందుతాయని ఓ టీవీ చానెల్ ఆపరేషన్ లో ఆందోళనకారులు తెలిపారు. అంతే కాకుండా పెట్రోల్ బాంబులు విసిరేందుకు అదనంగా 700 రూపాయలు ఇస్తారని, శుక్రవారం ప్రార్థనల అనంతరం రాళ్లు విసిరేందుకు మరి కొంత అదనంగా అందుతుందని వారు చెప్పారు.
బారాముల్లా, పఠాన్ కోట్, సోపోర్ జిల్లాల్లో తాము ఇలాంటి రాళ్లు విసిరే ఆందోళనల్లో పాల్గొన్నామని వారు చెప్పారు. అయితే తమకు ఈ డబ్బు ఎవరు ఇస్తారు? ఎలా ఇస్తారు? అన్న విషయాలను మాత్రం వెల్లడించమని అన్నారు. తమకు వాట్స్ యాప్ గ్రూప్ లు ఉన్నాయని, ఎక్కడ? ఎప్పుడు? ఎలా? ఎవరిపై రాళ్లు రువ్వాలి? అన్న దానిని ముందే చెబుతారని, వారు కోరుకున్నట్టు తాము చేస్తామని వారు తెలిపారు. జైలుకెళ్తే న్యాయవాదుల ఏర్పాటు వంటివి వారికి సంబంధించిన వారే చూసుకుంటారని అన్నారు. తమ గ్రూప్ లలో 12 ఏళ్ల బాలలు కూడా ఉన్నారని, అయితే కండపుష్ఠి కలిగిన వారికే ఎక్కువ ఆదాయం, ఆదరణ లభిస్తుందని వారు తెలిపారు.