: తొలి మేడిన్ ఇండియా రోబో 'బ్రాబో'... బ్రిటన్ లో అమ్మకాలకు సిద్ధం
టాటా మోటార్స్ అనుబంధ సంస్థ టీఏఎల్ మాన్యుఫాక్చరింగ్ తయారు చేసిన తొలి మేడిన్ ఇండియా రోబో 'బ్రాబో' కీలకమైన యూకే సీఈ సర్టిఫికేషన్ సంపాదించి, వాణిజ్యపరంగా అమ్మకాలకు సిద్ధమైంది. గత సంవత్సరం జరిగిన 'మేకిన్ ఇండియా వీక్'లో భాగంగా, సూక్ష్మ చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు ఉపయోగపడే ఈ ఆటోమేటిక్ రోబోను టీఏఎల్ తొలిసారిగా ప్రదర్శించిన సంగతి తెలిసిందే.
యూరోపియన్ హెల్త్, సేఫ్టీ, ఎన్విరాన్ మెంటల్ నిబంధనలను ఈ రోబో పాటిస్తోందని, యూకే ప్రకటించింది. పరిశ్రమల్లో ఆటోమేషన్ ఊపందుకుంటున్న సమయంలో, మానవ శక్తిని తగ్గించుకునేందుకు ఈ రోబో ఉపకరిస్తుందని, ముఖ్యంగా సాంకేతిక రంగంలో ఇది విప్లవాత్మక ప్రొడక్టని సంస్థ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అమిత్ భింగ్రూడే ఒక ప్రకటనలో తెలిపారు. ఈ రోబోను అవిశ్రాంతంగా వాడుకోవచ్చని, వివిధ రకాల పదార్థాలను విడి చేయడం, విడి భాగాలను అతికించడం, మెషీన్ల నిర్వహణ తదితరాల నుంచి తయారైన ఉత్పత్తుల ప్యాకేజింగ్ వరకూ దీన్ని వాడుకోవచ్చని తెలిపారు.