: రాజమండ్రికి పాకిన అసంతృప్తి సెగలు... బుచ్చయ్య చౌదరికి పదవి కోసం టీడీపీ కార్పొరేటర్ల మూకుమ్మడి నిరసన
మంత్రివర్గ విస్తరణ చిచ్చు రాజమండ్రిని తాకింది. సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరికి పదవిని ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ, ఈ ఉదయం టీడీపీ కార్పొరేటర్లంతా మూకుమ్మడిగా కౌన్సిల్ సమావేశాన్ని బహిష్కరించారు. ఈ సందర్భంగా వారంతా గోరంట్లకు అనుకూలంగా నినాదాలు చేయగా, వాతావరణం కొంత వేడెక్కింది. తెలుగుదేశం కౌన్సిలర్లు సమావేశాన్ని బహిష్కరించడంతో, నేడు జరగాల్సిన బడ్జెట్ ప్రవేశపెట్టే ప్రక్రియను మేయర్ రజనీ శేషసాయి వాయిదా వేయాల్సి వచ్చింది. గోరంట్లకు పదవి లభిస్తుందని తాము ఎంతో ఆశించగా, ఆయనకు స్థానం దక్కకపోవడం మనస్తాపాన్ని కలిగిస్తోందని ఈ సందర్భంగా పలువురు కార్పొరేటర్లు వ్యాఖ్యానించారు.