: బోండా ఉమాను బెదిరించారు.. మరి బుచ్చయ్య చౌదరి, ధూళిపాళ్ల లాంటి వారిని ఎందుకు బెదిరించలేదు?: బాబుకు అంబటి రాంబాబు సూటిప్రశ్న
పెరటిచెట్టు వైద్యానికి పనికిరాదని భావించి తమ పార్టీ ఎమ్మెల్యేలను తీసుకుని వాళ్లకు మంత్రి పదవులు ఇచ్చారని వైెఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత అంబటి రాంబాబు అన్నారు. నిన్న జరిగిన ఏపీ మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమంపై ఆయన ఈ రోజు గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ... టీడీపీలో ప్రారంభం నుంచి ఉన్నవారిని వదిలేసి, వైఎస్సార్ సీపీ నుంచి వచ్చిన వారికి పదవులు ఇచ్చారని అన్నారు. టీడీపీకి నిజంగా ప్రజాబలం ఉంటే తమ పార్టీనుంచి గెలిచి టీడీపీలోకి వచ్చి మంత్రి పదవులు పొందిన వారితో రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు రావాలని సవాలు విసిరారు.
టీడీపీలో బొజ్జల గోపాలకృష్ణారెడ్డి పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్నారని అటువంటి మంచి నాయకుడిని కాదని మంత్రివర్గం నుంచి పక్కనబెట్టేశారని అంబటి అన్నారు. మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదని అడిగినందుకు బోండా ఉమాను ముఖ్యమంత్రి చంద్రబాబు బెదిరించినట్లు తెలుస్తోందని, మరి గోరంట్ల బుచ్చయ్య చౌదరిని, ధూళిపాళ్ల నరేంద్రలాంటి వారిని ఆయన ఎందుకు బెదిరించలేదని అంబటి రాంబాబు ప్రశ్నించారు. కాపులు అంటేనే చంద్రబాబు మండిపడుతున్నారని ఆయన ఆరోపించారు. టీడీపీకి ప్రజాబలం లేదు కాబట్టే, ఓటమి భయంతో తమ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డిపై అవాకులు చవాకులు మాట్లాడుతున్నారని అంబటి అన్నారు. తన అనుకూల మీడియాతో చంద్రబాబు నాయుడు పిచ్చి కథనాలు రాయిస్తున్నారని ఆరోపించారు. ఆ పత్రికలు రాసేవన్నీ అసత్యాలని, ప్రజలు వాటిని నమ్మద్దని అన్నారు.