: కోర్టు మెట్లెక్కిన 200 మంది భారత జవాన్లు
తమకు సరైన తిండి పెట్టడం లేదని, అలవెన్సులు ఇవ్వండం లేదని, తాము పనిచేస్తున్న పరిస్థితులు కూడా చాలా ఘోరంగా ఉన్నాయంటూ 200 మంది సీఐఎస్ఎఫ్ సిబ్బంది కోర్టు మెట్లు ఎక్కారు. తమ బాధలను తెలుపుకుంటూ ప్రధాని కార్యాలయానికి లేఖ రాసినప్పటికీ ప్రయోజనం లేకపోయిందని ఆరోపిస్తూ, కర్ణాటక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వీరంతా బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో పనిచేస్తున్నారు.
కేంద్ర భద్రతా దళాలలో సీఐఎస్ఎఫ్ కూడా ఒక విభాగం. విమానాశ్రయాలతో పాటు ముఖ్యమైన ప్రభుత్వ రంగ సంస్థల భద్రత బాధ్యతలను ఈ సిబ్బంది చూసుకుంటుంది. తీవ్ర ఒత్తిడి మధ్య ఈ సిబ్బంది పనిచేస్తుంటుంది. గత మూడేళ్లలో సీఐఎస్ఎఫ్ కు చెందిన 344 మంది ఆత్మహత్యకు పాల్పడ్డారు. తీవ్రమైన ఒత్తిడి, ఉన్నతాధికారుల వేధింపులు, పని చేసే చోట దుర్భర పరిస్థితులు... ఇలా రకరకాల కారణాలతో వీరంతా అర్థాంతరంగా తమ జీవితాలను ముగిస్తున్నారు.