: పొద్దున్నే కార్యకర్తలతో జలీల్ ఖాన్ సమావేశం... హుటాహుటిన వచ్చిన దేవినేని, అచ్చెన్నాయుడు!
విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ ఇంట ఈ ఉదయం హైడ్రామా నడిచింది. ఉదయం ఆరు గంటలకే పలువురు ముస్లిం నేతలతో ఆయన సమావేశం ఏర్పాటు చేయడంతో, విషయం తెలుసుకున్న మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, అచ్చెన్నాయుడులు హుటాహుటిన ఆయన ఇంటికి చేరుకుని సముదాయించారు. స్థానిక ముస్లిం నేతలతో పాటు, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నేతలంతా తన రాజీనామాకు పట్టుబడుతున్నారని ఈ సందర్భంగా జలీల్ ఖాన్ మంత్రులకు తెలిపారు.
ఈలోగా కృష్ణా జిల్లా ఇన్ చార్జ్ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, కేంద్ర మంత్రి సుజనా చౌదరిలు ఆయనకు ఫోన్ చేశారు. తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దని చెప్పిన మంత్రులు, మంత్రి వర్గంలో చోటు దక్కని కారణాన్ని జలీల్ కు వివరించే ప్రయత్నం చేశారు. తాను పార్టీని వీడబోనని, అయితే, 12 శాతం ఉన్న ముస్లిం జనాభాకు తగు న్యాయం చేసి వుండాల్సిందని ఈ సందర్భంగా జలీల్ వ్యాఖ్యానించారు. తాను రాజీనామా చేయడం లేదని ఆయన మంత్రులకు హామీ ఇవ్వడంతో, మంత్రులు వెళ్లిపోయారు.