: ఇక నగలు, చీరలు ధరించి విమానం ఎక్కాలంటే కష్టమే!
భారత విమానాశ్రయాల్లో ఇప్పటివరకూ ఉన్న తడిమి చూసే పద్ధతి స్థానంలో ఫుల్ బాడీ స్కానర్ తనిఖీలు రానున్నాయి. ఈ విధానంలో భారతీయ మహిళలకు ఇబ్బందులు తప్పక పోవచ్చని తెలుస్తోంది. ముఖ్యంగా మెడలో తాళి బొట్టు, ఇతర నగలు, ఎక్కువ మడతలతో ఉన్న చీరలు కట్టుకున్నవారిని స్కానింగ్ చేయాలంటే క్లిష్టతరమవుతుందని, వాటిని తీసి పక్కన పెట్టాలంటే, అత్యధికులు అంగీకరించకపోవచ్చని, అయినా భద్రతాపరమైన సమస్యల నేపథ్యంలో ఫుల్ బాడీ స్కానర్లు తప్పనిసరని సీఐఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ ఓపీ సింగ్ వ్యాఖ్యానించారు. పైలట్ ప్రాజెక్టులో భాగంగా వీటిని ఢిల్లీ ఎయిర్ పోర్టులో పరిశీలించి చూడగా, ఇవి బాగానే పని చేశాయని, అయితే, పలువురు ప్రయాణికుల నుంచి మాత్రం తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయని ఆయన అన్నారు. కొన్ని ఇబ్బందులు ఏర్పడినా, భద్రత దృష్ట్యా అన్ని ఎయిర్ పోర్టుల్లో దశలవారీగా ఫుల్ బాడీ స్కానర్ల ఏర్పాటు తప్పదని ఆయన అన్నారు. ఇక క్యాబిన్ బ్యాగేజీలో ల్యాప్ టాప్ లను నిషేధించే విషయాన్ని కూడా పరిశీలిస్తున్నట్టు ఆయన తెలిపారు.