: 2011లో ఇదే రోజు... టీమిండియా మళ్లీ వరల్డ్ కప్ కొట్టిన రోజు!
ఏప్రిల్ 2, 2011... 28 సంవత్సరాల నిరీక్షణకు మహేంద్ర సింగ్ ధోనీ నేతృత్వంలోని భారత క్రికెట్ జట్టు తెరదించింది. భారత క్రీడా చరిత్రలో సుమధురంగా నిలిచిపోయేలా వరల్డ్ కప్ ను రెండోసారి అందించింది. తన ట్రేడ్ మార్క్ సిక్సర్ తో భారత జట్టును విజయతీరాలకు చేర్చిన ధోనీని ప్రతి భారతీయుడూ అభినందించాడు. అటు అనుభవం నిండిన సచిన్, సెహ్వాగ్, జహీర్ ఖాన్, యువరాజ్ వంటి సీనియర్లు, ఇటు కోహ్లీ, రైనా వంటి కుర్రాళ్లతో జట్టును నడిపించిన ధోనీ, సామర్థ్యానికి మించి క్రికెట్ అభిమానులు, ప్రముఖులతో నిండిన వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో శ్రీలంకపై భారత్ కు విజయాన్ని అందించాడు. 1983లో కపిల్ దేవ్ సేన వరల్డ్ కప్ ను సొంతం చేసుకున్న తరువాత, మరో వరల్డ్ కప్ ను సాధించాలన్న భారత క్రీడాభిమానుల కలను నెరవేర్చాడు. ఈ మ్యాచ్ లో విజయానికి 275 పరుగులు అవసరం కాగా, కేవలం నాలుగు వికెట్లు కోల్పోయి భారత్ విజయతీరాన్ని చేరుకుంది.