: అమరావతికి తరలిన నందమూరి, నారా కుటుంబ సభ్యులు
నవ్యాంధ్ర నూతన మంత్రివర్గ ప్రమాణ స్వీకారోత్సవానికి అమరావతి ముస్తాబైంది. వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయం సమీపంలోనే వేదిక ఏర్పాటు కాగా, 1500 మంది పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమానికి సుమారు 3,500 మంది వరకూ హాజరు కావచ్చని అంచనా. ఇక తొలిసారిగా ఎమ్మెల్సీగా ఎన్నికై, నేడు తండ్రి మంత్రివర్గంలో బాధ్యతలు స్వీకరించనున్న నారా లోకేష్ ప్రమాణ స్వీకారానికి హాజరయ్యేందుకు అటు నందమూరి కుటుంబ సభ్యులు, ఇటు నారా కుటుంబ సభ్యులు అమరావతికి బయలుదేరారు.
బాలకృష్ణ, భువనేశ్వరి, బ్రాహ్మణి తదితరులు కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా తిలకించనున్నారు. నూతన మంత్రులు, సీఎం కుటుంబ సభ్యులు కూర్చునేందుకు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. చంద్రబాబు, లోకేష్ ఈ ఉదయం 8:45 గంటలకు ఇంటి నుంచి ప్రమాణ స్వీకారోత్సవ వేదిక వద్దకు బయలుదేరనున్నారు. కాసేపట్లో గవర్నర్ నరసింహన్ వేదిక వద్దకు చేరుకోనున్నారు.