: రవీంద్ర గైక్వాడ్‌కు మరో షాక్.. ఈసారి టికెట్ క్యాన్సిల్ చేసిన స్పైస్‌జెట్
శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్‌కు కష్టాలు కడతేరడం లేదు. విమాన ప్రయాణం కోసం ఆయన పడరాని పాట్లు పడుతున్నారు. ఎయిరిండియా ఉద్యోగిపై చేయిచేసుకుని వివాదంలో కూరుకుపోయిన ఆయనపై విమానయాన సంస్థలు మండిపడుతున్నాయి. సంస్థ ఉద్యోగిపై చేయిచేసుకున్నందుకు నిరసనగా ఎయిరిండియా ఆయనపై నిషేధం విధించింది. అదే బాటలో ప్రైవేటు విమానయాన సంస్థ ఇండిగో కూడా నడిచింది. ఇప్పుడు మరో ప్రైవేటు విమానయాన సంస్థ స్పైస్‌జెట్, గైక్వాడ్ బుక్ చేసుకున్న టికెట్‌ను రద్దు చేసి షాకిచ్చింది.
ఏప్రిల్ 3న పుణె నుంచి అహ్మదాబాద్ ప్రయాణించేందుకు శనివారం గైక్వాడ్ టికెట్ బుక్ చేసుకున్నారు. ఆయన పేరు ప్రత్యక్షమవగానే స్పైస్‌జెట్ రిజర్వేషన్ సిస్టం అప్రమత్తమై ఆయన పేరును చూపించింది. దీంతో వెంటనే ఆ టికెట్‌ను రద్దు చేసినట్టు స్పైస్‌జెట్ అధికార ప్రతినిధి తెలిపారు. కాగా, ఘటన తర్వాత ఎయిరిండియాలో ప్రయాణించేందుకు ఐదుసార్లు ప్రయత్నించి గైక్వాడ్ విఫలమయ్యారు. వివిధ పేర్లతో ఆయన టికెట్ బుక్ చేసుకునేందుకు ప్రయత్నించగా అన్నిసార్లూ ఎయిరిండియా రద్దు చేసింది.